Wednesday, May 8, 2019

                                               




Tuesday, July 17, 2018




మా బడి పిల్లల ముచ్చట్లు 



మా పిల్ల ముచ్చట్లు 18 : 
చిన్నారి తల్లులు :

                






మన ఇళ్ళలో ఇంకా పదేళ్ళ పిల్లలకు కూడా మనం అన్నం తినిపిస్తుంటాం. ముద్దు చేస్తుంటాము. ఆ వయసుకు జడలు మనమే వేస్తాము, వారికి కావాల్సిన అన్ని పనులు పెద్ద వాళ్ళు కానీ పని మనష్యులు కానీ చేస్తుంటారు.
కానీ మా బడుల్లోని పిల్లలు మాత్రం ఇందుకు విరుద్దం. చాలా చిన్న వయసుకే పొయ్యి వెలిగించడం అలసిపోయి వచ్చే అమ్మా నాన్నల కోసం నీళ్ళు కాయడం.. అన్నం వండడం.. వాకిలి చిమ్మి ముగ్గులు వేయడం నీళ్ళుపట్టడం గిన్నెలుతోమడం ఇలా ఎన్నో పనులు నేర్చేసుకుంటారు ..
అంతేనా అమ్మలంతా చేలకు వెళితే ఇంట్లో ఉన్న చిన్ని చెల్లినో తమ్మున్నో చూసుకోవడానికి వీళ్ళే చిన్నారి తల్లులగా మారిపోతారు. బడి ఈడున్న.. బడికి వెళ్ళి చదువుకోవాల్సి ఉన్న.. అక్కలూ బడికి రాకుండా ఈ పిల్లలను చూసుకోవాడానికి ఇంట్లోనే ఉండిపోతారు ..
మేమంతా బడి బాటంటూ బయలుదేరి ఇంటింటికీ వెళ్ళి బలవంతాన ఈ పిల్లలను బడికి రప్పిస్తుంటాము. ఇక మూడేళ్ళలోపు ఉన్న ఆ చిన్న పిల్లలను అంగన్ వాడీల్లో చేర్పిస్తుంటాం. కానీ అక్కలకు అలవాటు పడ్డ ఈ పిల్లలు అంగన్ వాడీల్లో ఉండకుండా ఏడ్చి గోలపెట్టి ఈ అక్కల దగ్గరకే ..అంటే మా పెద్ద బడికే వచ్చేస్తుంటారు.. లేదా ఈ అక్కలే తమ తమ్ముళ్ళనూ చెల్లెలనూ తమతో పాటు బడికి తె చ్చేసుకుంటారు. మేము చిన్న పిల్లలను ఇలా బడికి తీసుకురావద్దు అని గట్టిగా అన్నాము అనుకోండి వీళ్ళు కూడా బడికి రారు. సరే అని రానిచ్చామనుకోండి.. వీళ్ళ అల్లరి కూడా మేమే భరించాలి..
ఇలా కాదు అసలు బడి ప్రాంగణంలోనే అంగన్ వాడీలు ఉంటే.. అక్కలూ చెల్లెల్లూ ఒకే దగ్గర ఉంటారు. మధ్య మద్య వీళ్ళను వాళ్ళూ, వాళ్ళను వీళ్ళూ చూసుకుంటూండవచ్చు అని.. ఓ కొత్త ప్రతిపాదన చేసి బడి ప్రాంగణంలోనే అంగన్ వాడీలు ప్రారంభమయినాయి. చాలా సంతోషం ...
కానీ ఉన్న పిల్లలకే గదులు చాలక అవస్థ పడుతున్న పెద్దబడులు ఈ అంగన్ వాడీ పిల్లకోసం గదులను ఇవ్వలేక పోతున్నాయి . దానితో మళ్ళీ ఎక్కడి అంగన్ వాడీలు అక్కడే గ్యాప్ చిప్.. అన్నట్లుగా అయిపోయింది పరిస్తితి..కానీ ఆ చిన్న పిల్లలు మాత్రం ఈ చిన్నారి తల్లులను వదిలిపెట్టకుండా పెద్దబడికే వస్తుంటారు.. ఇది రివాజు..
ఇలా అంగన్ వాడీలు బడి ప్రాంగణంలో ఉండడం వల్ల మరో గొప్ప ప్రయోజనం ఉన్నది.. మా చిన్నారి చిట్టి చిన్ని పిల్లలు రేపు ప్రైవేట్ బడులకు వెళ్ళకుండా ఒకటో తరగతిలో చేరి, మా బడిలోనే మా దగ్గరే చదువుకుంటారు.. కానీ అంగన్ వాడీలను పెద్దబడులతో మిళితం చెయ్యాలన్న ప్రభుత్వం.. కావలసిన గదులను కూడా కట్టాలి కదా .. అదెప్పుడు జరుగుతుందో ...
ఊరిలో ఉన్న ఒకే బడి ఒకే ప్రాంగణంలోకి చిట్టి పొట్టి చిన్నారులంతా నిశ్చింతగా రాగల రోజులకోసం మాతో పాటు మా చిన్నారి తల్లులు కూడా ఎదురు చూస్తున్నారు ..